పాక్‌కు వెళ్లే సంగక్కర జట్టు ఇదే..

లండన్‌: వచ్చే నెలలో పాకిస్తాన్‌లో పర్యటించనున్న కుమార సంగక్కర నేతృత్వంలోని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) జట్టును ప్రకటించారు. ఈ మేరకు 12 మందితో కూడిన ఇంగ్లిష్‌ కౌంటీ క్లబ్‌ జట్టును ఎంసీసీ తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో సంగక్కర సారథిగా వ్యవహరిస్తుండగా, మరో సీనియర్‌ క్రికెటర్‌ రవి బొపారాను సైతం ఎంపిక చేశారు. పాక్‌ పర్యటనలో ఎంసీసీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) జట్లైన లాహోర్‌ క్వాలండర్స్‌-ముల్తాన్‌ సుల్తాన్స్‌తో ఎంసీసీ ఆడనుంది. ఇక మూడో మ్యాచ్‌ను పాకిస్తాన్‌ దేశవాళీ టీ20 మ్యాచ్‌ విజేత నార్తరన్‌తో ఎంసీసీ జట్టు తలపడుతోంది.



తమ దేశంలో క్రికెట్‌ను బతికించాలంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని ఎంసీసీ గత నెల్లో ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్‌ పర్యటనకు పంపడానికి సమాయత్తమైంది. ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంగక్కర సారథ్యంలోని జట్టు.. పాకిస్తాన్‌ పర్యటనకు పంపాలని నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌ తరహా దేశాల్లో క్రికెట్‌ను బ్రతికించడం చాలా ముఖ్యమని భావించిన ఎంసీసీ.. పాక్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయనే చెప్పాలనే ఉద్దేశంతోనే తమ జట్టును అక్కడకు పంపుతుంది.